స్వాగతం!
e-తెలుగు, బ్లాగరులు, వికీపీడియనులు చేస్తున్న ప్రయత్నాల కారణంగా తెలుగు కంటెంటు అంతర్జాలంలో అనేక రకాలుగా విస్తరిస్తోంది. రాజకీయ, సామాజిక, వ్యక్తిగత అంశాలపై వివిధ బ్లాగులతోపాటు, వికీపీడియా రూపంలో విజ్ఞాన సర్వస్వం కూడా తెలుగులో లభిస్తోంది. సైన్సుకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడిప్పుడే తెలుగులో వస్తున్నాయి.
అంతర్జాలానికి సంబంధించిన వివిధ విషయాలపై సమాచారం తెలుగులో చాలా తక్కువగా లభ్యమౌతోంది. అసలు అంతర్జాలం ఎలా పనిచేస్తుంది, డొమెయిన్ పేరు, ఐపీ అడ్రసు, వెబ్‍సైటు, హోస్టింగు వంటి అనేక ప్రాథమిక విషయాలతో ప్రారంభించి అంతర్జాల సమాచారాన్ని, వార్తలు విశేషాలను తెలుగులో అందించాలనే సంకల్పంతో prapancham.in ను ప్రారంభించాం.
ప్రపంచం.ఇన్ అనే పేరులోని ccTLD ని తెలుగులోకి అనువదించి ప్రపంచం.లో అని పిలుచుకుంటున్నాం
. పేరుకు తగినట్టే ప్రపంచంలో ఉండే అనేకానేక విషయాలను అందించాలనేది మా సంకల్పమైనప్పటికీ, జాల ప్రపంచపు విశేషాలను ముందుగా అందిస్తున్నాం. సమాచారం అందించడంతోపాటు, డొమెయిన్ పేరుల నమోదు, వెబ్ డిజైను, వెబ్ హోస్టింగు వంటి సేవలను కూడా అందించాలనేది మా సంకల్పం. ప్రస్తుతానికి డొమెయిన్ పేరు నమోదు సేవను అందిస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా ప్రపంచం.లో నే domains.prapancham.in అనే ఒక ఉప వెబ్‍సైటును ఏర్పాటు చేసాం. ఈ ఉప వెబ్‍సైటు కూడా పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. ప్రపంచంలోనే ఈ సేవలను తెలుగులో అందించే మొదటి సైటు -ప్రపంచం.ఇన్.
డొమెయిన్ పేరును కొనుక్కున్నవారికి, వెబ్‌సైటు తయారుచేసి, హోస్టింగు చేసి, సైటును నిర్వహించే సేవను కూడా ప్రారంభిస్తున్నాం. వీటితో పాటు, ఆసక్తి కలిగిన వాడుకరులకు తమ సైటును తామే నిర్వహించుకునేందుకు అవసరమైన శిక్షణను ఇస్తున్నాం.
తెలుగువారికి వెబ్‍సేవలను తెలుగులో అందించే మా ప్రపంచం.ఇన్ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ-
ప్రపంచం.ఇన్ జట్టు



